మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ పర్యటన

సీఎం ఫడ్నవీస్‌తో మర్యాదపూర్వక భేటీ

సాక్షి డిజిటల్ న్యూస్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కల్యాణ్‌‌లు చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, కండరాలు చిట్లడంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సోమవారం రోజున వైద్య పరీక్షల నిమిత్తం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ముంబైలోనే ఉన్న పవన కల్యాణ్ మంగళవారం మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్షా బంగ్లాకు వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చలు ఫలవంతంగా సాగినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. ఇక, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఫడ్నవీస్, పవన్ కల్యాణ్‌లు నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన కల్యాణ్ మాట్లాడుతూ…. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పారు. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *