రైతుభరోసా నిధుల అంశంలో రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 30 నెలల పాలనలో దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఎగ్గొట్టారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ‌ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా వానాకాలం సీజన్‌కు రైతు భరోసా నిధులను విడుదలను ప్రారంభించనున్నారు. అయితే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిది ముదనష్టపు పాలన అని… వారి 30 నెలల పాలనలో దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఎగ్గొట్టారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘మీ (రేవంత్ రెడ్డి) 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ?’’ అని తీవ్ర పదజాలంతో కేటీఆర్ ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేవలం ఒక్క బటన్ నొక్కి రైతు భరోసా నిధులు వేయకుండా… బహిరంగ సభ పెట్టే రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం అవివేకమే అవుతుందని కేటీఆర్ న్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసిన కాంగ్రెస్… చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న పాపం కాంగ్రెస్‌ను నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయమని పేర్కొన్నారు. ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని… చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి 72 సార్లు ఢిల్లీ టూర్లకు, పనికిరాని పబ్లిక్ మీటింగ్‌లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేదని చెప్పుకొచ్చారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అన్నదాతల అల్లా కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *