సాక్షి డిజిటల్ న్యూస్: సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక బోధనపైనే టీచర్లు శ్రద్ధ వహించాలి అని సూచించారు.‘విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు.మీరు సరిగా చదవకపోతే ఆయన నాకు మైనస్ మార్కులు వేస్తారు, నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది’అని మంత్రి లోకేష్ చమత్కరించారు. ‘సమాజంలో మార్పు తెచ్చేందుకే నేను అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నాను. దీనిని నేను ఛాలెంజ్ గా స్వీకరించాను. విద్యావ్యవస్థలో మార్పు తేవడం ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుంది. దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నది నా ధ్యేయం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుంది’ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ… గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాం. రాష్ట్రవ్యాప్తంగా హార్డ్ వేర్ (ఇన్ ఫ్రా) మెరుగైంది, సాఫ్ట్ వేర్ (లెర్నింగ్ అవుట్ కమ్స్) మెరుగు పర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించాం. అభ్యసనా ఫలితాల మెరుగుదలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలి. వెనుకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను అందజేస్తాం. వివిధ తరగతుల్లో వెనుకబడిన పిల్లలు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, అటువంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్డండి. నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలతో యాడ్స్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు. ‘గత విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ వస్తున్నాం. టీచర్లు ఇక పూర్తిస్థాయిలో బోధనపైనే శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులు తమ రోజువారీ విధినిర్వహణలో ఏదైనా సమస్య తలెత్తితే మీరు ఎంఇఓ, డిఇఓలకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, లీప్ యాప్ ద్వారా నేరుగా నాకు చెప్పొచ్చు’ మంత్రి లోకేష్ అన్నారు.‘వచ్చేనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్ – టీచర్ మీటింగ్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా చొరవ తీసుకొని తల్లిదండ్రులను చైతన్యపర్చి లీప్ యాప్ డౌన్ లోడ్ చేయించండి. విద్యావ్యవస్థలో నేను అనుకున్నది సాధించాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సహకారం అవసరం. అందరి సమిష్టికృషితోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలుగుతాం. అందరం టీమ్ వర్క్ గా పనిచేసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాదిద్దాం’ అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.‘ప్రభుత్వం అమలుచేసిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక, జిఎఫ్ఎల్ఎన్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల్లో యాడ్స్ ఇవ్వడం ప్రోత్సాహకరంగా ఉంది’అని ఉపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ దీర్ఘకాలంలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అవసరం లేనివిధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. పదోతరగతిలో బాలికలు ఫెయిలైతే వారు సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలన్నారు. గత ఏడాది మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ మనీష మాట్లాడుతూ… కేవలం 155 రోజుల్లో డిఎస్సీని పారదర్శకంగా పూర్తిచేసి, నాలాంటి వేలాదిమంది టీచర్ల కల నెరవేర్చారంటూ మంత్రి లోకేష్‌కు కృతజ్జతలు తెలిపారు. హిందీ టీచర్ అనిత మాట్లాడుతూ… కొక్కిలిగడ్డ హైస్కూలులో ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని విజ్జప్తి చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన వర్క్ బుక్స్ ఫలితాలను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.