జనం న్యూస్ : ఢిల్లీలో రూ. 700 కోట్ల మెడికల్ స్కామ్లో మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. గతంలో ఒకర్ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఈ ఇద్దరితో కలిపి మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసిన ఇద్దర్ని కోర్టులో హాజరుపరచగా జ్యూడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లులో సుమారు రూ. 650 నుంచి రూ. 700 కోట్ల విలువైన కొనుగోళ్లులో భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లులో రూ. 700 కోట్ల కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వాత్సల అగర్వాల్, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాలను ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా.. కోర్టు జూలై 7 వరకు వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపింది.వాత్సల అగర్వాల్, నీరజ్ చోప్రాలను తాజాగా అరెస్టు చేసిన ఏసీబీ గతంలో వినోద్ కుమార్ రంగాను కూడా అరెస్టు చేసింది. దాంతో ఈ కేసులో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వం ఆస్పత్రుల కోసం మందులు, వైద్య పరికరాలు, ఇతర ఆరోగ్య సామగ్రి కొనుగోళ్లలో రూ. 700 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తు అధికారుల వివరాల మేరకు.. రూ. 650 నుంచి రూ. 700 కోట్ల విలువైన కొనుగోళ్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ భారీ స్కామ్లో ప్రభుత్వానికి జరిగిన అసలు నష్టం ఎంత? సరుకులు పూర్తిగా సరఫరా చేశారా? ధరలను కృత్రిమంగా పెంచారా? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కొన్ని వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నప్పటికీ, రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాతే స్పష్టమైన నిర్ధారణకు రావచ్చని అధికారులు చెప్పారు. విజిలెన్స్ డైరెక్టరేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. కొంతమంది సరఫరాదారులకు అబ్ధి చేకూర్చేందుకు టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్య పరికరాలు, మందులు, శస్త్రచికిత్స సామగ్రి, బిడ్ లెనిన్, పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, సీ ఆర్మ్ రేడియాలజీ పరికరాలు తదితర వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. కొనుగోళ్లలో పాల్గొన్న సంస్థల్లో ఏవైనా షెల్ కంపెనీలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సలహా పలు ప్రభుత్వ సంస్థల నుంచి రికార్డులను సేకరిస్తున్నారు. దర్యాప్తులో కొత్త ఆధారాలు లభిస్తే మరికొందర్ని కూడా విచారణకు పిలిచి అవకాశం ఉందని ఏసీబీ అధికారులకు తెలిపారు.