వైద్య ఖర్చులతో పేదలు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వ సంకల్పం డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్‌లో జరిగిన టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా హెల్త్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 సౌత్ ఎడిషన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విలువైనదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకుకోకపోతే ఒక కుటుంబం విచ్ఛిన్నం కావొచ్చని… ఒక జీవితం శాశ్వతంగా మారిపోవచ్చని… ఒక పేద కుటుంబం ఒక తరం మొత్తం పొదుపు చేసిన డబ్బును కోల్పోవచ్చని అన్నారు. అందుకే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి ప్రథమ భద్రత అని పేర్కొన్నారు. ఆరోగ్యం అంటే కేవలం ఆస్పత్రులు మాత్రమే కాదని… సురక్షితమైన ప్రసవం, పిల్లల పోషణ, టీకాలు, ముందస్తు రోగ నిర్ధారణ, సరసమైన ధరలకు మందులు, వ్యాధికి సరైన చికిత్స అందించగల నిపుణులు, ఒక పేద రోగి బిల్లు భయం లేకుండా ఆసుపత్రిలో చేరగలిగే అనేక విషయాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్య సంరక్షణ అనేది చాలా కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా హెల్త్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 సౌత్ ఎడిషన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలు అందించిన పలువురికి అవార్డులు అందజేశారు. ఈ వేదికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఆరోగ్య శాఖ అనే పరిపాలనలో అతి సున్నితమైనదని పేర్కొన్నారు. టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా హెల్త్ సమ్మిట్ 2026 – సౌత్ ఎడిషన్‌ సదస్సు కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని… ఇది హెల్త్ కేర్ పరంగా ఏమి సాధించామో, వేటిని నిర్లక్ష్యం చేశామో, ఇప్పుడు అత్యవసరంగా వేటిపై దృష్టి సారించాలనేది తెలియజేస్తుందని చెప్పారు. ప్రజారోగ్యం అనేది ఏదో అదృష్టం వల్ల జరిగేది కాదని దక్షిణ భారతదేశం నిరూపించిందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రజా ఆరోగ్యం అనేది అక్షరాస్యత, మహిళా విద్య, పోషణ, ప్రాథమిక సంరక్షణ, వైద్య విద్య, విజ్ఞాన శాస్త్రం, సంస్థలు, పరిపాలనా నిబద్ధతల ఫలితమని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో పటిష్టమైన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రపంచ స్థాయి ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ ప్రతిభతో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ, డయాగ్నోస్టిక్స్, హెల్త్-టెక్ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంపై ఫోకస్డ్‌గా ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *