సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలోని రైతులకు బిగ్ అలర్ట్… రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించినట్టుగా తెలిసిందే. అయితే రైతు భరోసాలో మరింత రైతులకు మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త రైతులు కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రైతు భరోసాకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చనే వివరాలు తెలుసుకుందాం… రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. 12 వేలను రెండు విడుతల్లో రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ మొత్తం అందజేస్తుంది. అయితే ఈ ఏడాది వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే రైతు భరోసా ప్రయోజనం పొందుతున్నవారితో పాటు ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోని రైతులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు… రైతు భరోసా పథకం కింద ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జూన్ 15 తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు… రైతు భరోసా సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం రైతులు ఏఈవోకి గానీ, ఎంఏవోకి గానీ సంప్రదించి… దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్సులను కూడా అందజేయాలి. ఈ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. అనంతరం వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకొని.. రైతుభరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే వారు కూడా లబ్దిదారుల చేరతారు. దీంతో ఈ వానాకాలం రైతు భరోసా సాయం అందుకునేందుకు అర్హులు అవుతారు. ఇక, వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా నిధుల విడుదలను ఈనెల 30న ప్రారంభించనున్నట్టుగా తెలిపింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘వానా కాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించడం జరుగుతుంది’’ అని తెలిపారు.