జనం న్యూస్ : రైలులో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి విధించే జరిమానాను భారతీయ రైల్వే పెంచింది. దీంతో ఇప్పటివరకు రూ. 250గా ఉన్న కనీస జరిమానా ఇప్పుడు రూ. 500కి పెరిగింది. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్… రైలులో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి విధించే జరిమానాను భారతీయ రైల్వే పెంచింది. దీంతో ఇప్పటివరకు రూ. 250గా ఉన్న కనీస జరిమానా ఇప్పుడు రూ. 500కి పెరిగింది. ప్రయాణికులు టిక్కెట్టు లేకుండా ప్రయాణించినా లేదా పాత టిక్కెట్లను తిరిగి ఉపయోగించడానికి ప్రయత్నించినా… ప్రయాణించిన దూరానికి అసలు టిక్కెట్టు ధరతో పాటు అదనంగా రూ. 500 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ప్రయాణికుడు ఏ స్టేషన్ నుంచి బయలుదేరాడనే దానిపై స్పష్టత లేకపోతే… ఆ రైలు సర్వీసు ప్రారంభమైన స్టేషన్ నుంచే ఛార్జీని వసూలు చేసే చట్టపరమైన అధికారం కూడా రైల్వేలకు ఉందని పేర్కొంది. వివరాలు… రైలులో ప్రయాణించే ముందు సరైన టికెట్లను కొనుగోలు చేయాలని ప్రయాణికులను భారతీయ రైల్వే అధికారులు పదే పదే కోరుతున్న సంగతి తెలిసిందే. రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే వారికి జరిమానాలు కూడా విధిస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తూనే ఉన్నారు. ఒక్క మే నెలలోనే సెంట్రల్ రైల్వే జోన్ 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి రూ. 40.85 కోట్లను వసూలు చేసింది. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అనధికారిక, టికెట్ లేని ప్రయాణాలను అరికట్టడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ లేని ప్రయాణానికి జరిమానాను రెట్టింపు చేసినట్టుగా భారతీయ రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ‘జన్ విశ్వాస్ చట్టం, 2026’ నిబంధనల ప్రకారం… రైల్వే చట్టం, 1989లోని సెక్షన్లు 137, 138 కింద విధించే కనీస జరిమానాను రూ. 250 నుంచి రూ. 500కు పెంచినట్లు తెలిపింది. ఇది 2026 జూన్ 20 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు రైల్వే నిబంధనలను పాటించాలని, చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో మాత్రమే ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు. లేకపోతే చట్టపరంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రయాణికులు విధించిన జరిమానాను చెల్లించడంలో విఫలమైనా, నిరాకరించినా… జరిమానా వసూలు చేసే అధికారం కలిగిన రైల్వే ఉద్యోగి ఆ మొత్తాన్ని వసూలు చేయడానికి సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అప్పుడు ఆ మొత్తాన్ని ప్రయాణికుడు చెల్లించాల్సిందేనని న్యాయస్థానం నిర్ధారిస్తే… దానిని వసూలు చేయాలని ఆదేశించవచ్చు. అలాగే, జరిమానా చెల్లింపు చేయడంలో విఫలమైతే ఆ వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా ఐదు వందల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించేలా ఆదేశించే అవకాశం ఉందని పేర్కొంది.