అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబాట్లు?

అక్షర ఆయుధం : అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని, సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని, సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. నాహ్‌ ట్రైబల్ గ్రూప్‌నకు చెందిన నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో తాము పచ్చిక బయళ్లు, వేట కోసం వినియోగించే ప్రాతాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున చైనా ఆర్మీ ఆక్రమించిందని నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి సొసైటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఇప్పటికే భారత సైన్యం కొట్టిపారేసింది. అయితే తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం… నాహ్ వెల్ఫేర్ సొసైటీ చేసిన ఆరోపణలపై దృష్టి సారించింది. టైమ్స్ నౌతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన అరుణాచల్ ప్రదేశ్ హోం మంత్రి మామా నటంగ్… నాహ్ వెల్ఫేర్ సొసైటీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు.‘‘మేము భారత భూభాగంలో అంగుళం కూడా చైనాకు ఇవ్వబోము… ఎవరైనా మన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు, భారతదేశ ప్రజలు దానిని ఎప్పటికీ సహించరు. ఈ ఆరోపణలను ధ్రువీకరించాలని యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఒక వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు చేసిందని, ఈ విషయం మీడియాలో కూడా వచ్చిందని మాకు తెలుసు. అయితే ఇప్పటి వరకు మాకు ఎటువంటి అధికారిక ధృవీకరణ అందలేదు’’ అని నటంగ్ ‘టైమ్స్ నౌ’తో చెప్పారు. నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ ప్రస్తావించిన ఫొటోలను నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా నటంగ్ తెలిపారు. ‘‘వాస్తవాలను నిర్ధారించుకోవడానికి మేము ఆ వైరల్ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. సరిహద్దులో మోహరించిన అధికారులు, సంబంధిత యంత్రాంగం అధికారిక వివరణ ఇచ్చే వరకు… ధృవీకరించని ఏ ఆరోపణలనూ మేము నిజమని అంగీకరించము. దీనికోసం ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాము. యంత్రాంగం ఈ విషయాన్ని యాక్టివ్‌గా పరిశీలిస్తోంది’’ అని నటంగ్ చెప్పారు. అరుణాచల్‌లో చైనా ఆక్రమణ వార్తలను భారత సైన్యం ఖండించింది అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొత్తగా ఆక్రమణలకు పాల్పడిందని, వారి సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని వచ్చిన మీడియా కథనాలను భారత సైన్యం సోమవారం కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు ఎటువంటి ఆధారం లేనివని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దు వెంబడి చైనా ఇటీవల చొరబాట్లకు పాల్పడిందన్న వార్తలను గమనించామని… ఆ ప్రచారంలో ఉన్న సమాచారంంలో వాస్తవం లేదని సైన్యం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *