వైఎస్ జగన్ ఏ రోజైనా అమరావతికి వ్యతిరేకమని చెప్పారా?:

*దేవినేని అవినాష్

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రౌడీ రాజ్యం నడుస్తుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అమరావతి ప్రాంతానికి తాము మళ్లీ వెళతామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అమరావతికి వ్యతిరేకమని తాము ఏ రోజు కూడా చెప్పలేదని తెలిపారు. వైసీపీ నాయకులు గానీ, వైఎస్ జగన్ గానీ అమరావతికి వ్యతిరేకమని చెప్పారా? అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో రెండు రోజుల క్రితం వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై దేవినేని అవినాష్ సోమవారం రోజున మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రౌడీ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన రైతు పరిరక్షణ కమిటీలో తాము అందరం ఉన్నామని తెలిపారు. అక్కడ వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. భూములు ఇవ్వని రైతులను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వారు జగన్‌ను కలిస్తే ఆయన కమిటీ ఏర్పాటు చేశారని, వారి బాధలు విన్న తర్వాత తాము అక్కడికి వెళ్లాలని చూశామని తెలిపారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పని చేశారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు మాత్రం అక్కడ వారికి మందు పోయించి రాళ్లు, గుడ్లతో దాడులు చేసే విధంగా ప్రోత్సహించారని దేవినేని అవినాష్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, వారు అమరావతికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో తాము అమరావతికి వ్యతిరేకం అన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతికి తాము వ్యతిరేకం అని ఏ రోజూ చెప్పలేదని అన్నారు. ‘‘ఏ రోజైనా… వైసీపీ గానీ, వైఎస్ జగన్ గానీ, మేము గానీ అమరావతికి వ్యతిరేకమని చెప్పామా?… ఏ రోజు కూడా అమరావతికి వ్యతిరేకమని మేము చెప్పలేదే?. జగన్ నాయకత్వంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో పాటు మధ్యలో ఉన్న అమరావతి అభివృద్ది చెందాలని కోరుకున్నాం. మీరు చేస్తున్న అవినీతికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకోవడానికి, రైతులను ఇబ్బంది పెట్టడానికి మేము వ్యతిరేకం’’ అని అవినాష్ పేర్కొన్నారు. అమరావతిలోని ప్రతి రైతుకు అండగా ఉంటామని అవినాష్ చెప్పారు. తమను ఎన్ని సార్లు ఆపుతారో, ఎంత మంది పోలీసులను అడ్డుపెట్టుకుంటారో చూస్తామని అన్నారు. ఎంతమందిని అడ్డుపెట్టుకున్న తాము అమరావతిలో తిరుగుతామని, పర్యటిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేసే అవినీతిని ప్రజల ముందు పెడతామని అన్నారు. తమ నాయకులపై రౌడీ ముద్ర వేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తమ పార్టీ నాయకులపై దాడి చేసి… తిరిగి తమపైనే కేసులు పెట్టారని… జంగిల్ రాజ్ అనడానికి ఇంతకన్నా ఉదారహణ ఏమన్నా ఉంటుందా? అని ప్రశ్నించారు. రాయి వేసి పోలీసులను గాయపరిచిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే తమపైన కేసులు నమోదు చేస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. గత రెండేళ్లలో ఏ ఒక్క రైతుకి కూడా ప్రభుత్వం న్యాయం చేయలేదని దేవినేని అవినాష్ ఆరోపించారు. ఈ చుట్టుపక్కల ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. విజయవాడను గొంతు పిసికి చంపేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ ప్రాంతంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ… దోచుకోవడం, దాచుకోవటంలో ఉన్నారని ఆరోపణలు చేశారు. మరోసారి రేపు తమ కమిటీ సభ్యులతో అమరావతికి వెళ్తామని దేవినేని అవినాష్ అన్నారు. అమరావతి లో జరిగే స్కామ్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు. తన తండ్రి దేవినేని నెహ్రూ గారి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తనను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే తన తండ్రి చెప్పినట్లు అమరావతికి అండగా ఉంటానని, అక్కడ రైతుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *