తెలంగాణ నుంచి రాజ్యసభకు మీనాక్షి..?

* క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

పయనించే సూర్యుడు న్యూస్ : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నామినేషన్‌ను బీజేపీ, ఎన్నికల సంఘం లాలూచీపడి తిరస్కరించాయని, తన సీటును దొంగిలించారని ఆమె ఆరోపించారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని.. అఫిడవిట్ సాకుతో కుట్ర పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తినని.. కాబట్టి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. తెలంగాణ నుంచి ఎవరితోనూ రాజీనామా చేయించి సీటు తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ స్థానానికి తాను దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంపై తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో బీజేపీ కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. తనపై ప్రస్తుతం ఎలాంటి లీగల్‌ కేసులు లేవని, చట్టబద్ధంగా తాను అన్ని నిబంధనలను పాటించానని స్పష్టం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఒక పాత కేసు అంశాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదనే సాంకేతిక కారణాన్ని చూపుతూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ, ఈసీ లాలూచీపడి, కుట్రపూరితంగా తన నామినేషన్‌ను తిరస్కరించాయని ఆమె ధ్వజమెత్తారు. తన రాజ్యసభ సీటు తీవ్రమైన కుట్రతో చోరీకి గురైందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువులకు విరుద్ధంగా చేస్తున్న కుట్రలను, అక్రమాలను సమాజానికి విడమరిచి చెప్పడానికే తాము ఈ లీగల్ పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లు తనకోసం మరొకరితో బలవంతంగా రాజీనామా చేయించి, తెలంగాణ కోటాలో తాను రాజ్యసభ సీటును తీసుకోలేనని చెప్పారు. తాను పుట్టి పెరిగింది, రాజకీయాలు చేసింది మధ్యప్రదేశ్‌లోనే కాబట్టి ఆ రాష్ట్ర ప్రజల తరఫునే తాను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటాననని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత శత్రువులే మీనాక్షి నటరాజన్ కేసుల వివరాలను ప్రత్యర్థి పార్టీకి అందించారంటూ వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన కేసుల సమాచారాన్ని కాంగ్రెస్‌ నేతలే ప్రత్యర్థులకు ఇచ్చారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. బీజేపీ తన ఓటమి భయంతోనే ఇటువంటి అసత్య ప్రచారాలకు తెరలేపిందని విమర్శించారు. అఫిడవిట్‌లో చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన నామినేషన్ తిరస్కరించాల్సిన అవసరం లేదని.. దీని వెనుక పెద్ద రాజకీయ హస్తం ఉందని ఆరోపించారు. స్క్రూటినీ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలను నామినేషన్‌ రూమ్‌లోకి అధికారులు ఎందుకు అనుమతించారని ఆమె ఈసీని నిలదీశారు. కాగా, మీనాక్షి నటరాజన్ గతంలో రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత కీలక నేతగా పనిచేశారు. మధ్యప్రదేశ్ మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో.. ఈ నామినేషన్ తిరస్కరణ అంశం తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ తిరస్కరణను కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా.. నిబంధనల ప్రకారమే ఈసీ నిర్ణయం తీసుకుందని బీజేపీ వాదిస్తోంది. ఈ నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ లీగల్ టీమ్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *