విద్యార్థుల ఆహారంపై విమర్శలు అనవసరం

జగన్‌పై లోకేష్ స్పందన

సాక్షి డిజిటల్ న్యూస్: స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు రుచి, శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెడుతుంటే వైఎస్ జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు రుచి, శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెడుతుంటే జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నారని మండిపడ్డారు. పేద పిల్ల‌ల‌కు మంచి భోజనం పెట్ట‌డం, ఆరోగ్యం ఉండ‌డం కూడా స‌హించ‌లేక‌పోతే ఎలా జ‌గ‌న్? అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా జగన్ చేసిన ట్వీట్‌కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వివరాలు… ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. వీరిలో దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు చాలా మంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర జరుగుతుందని జగన్ ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా ఆ అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని ఆరోపించారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ. 1,000గా ఉండే జీతాన్ని వైసీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత తాము రూ.3వేల వరకు పెంచామని అన్నారు. అయితే గత ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో వీరిని తొల‌గించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతామని, వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని కోరారు. అయితే జగన్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు రుచి, శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెడుతుంటే జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నారని విమర్శించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్న‌వారితోపాటు అద‌నంగా మ‌హిళ‌లు, పేద‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తుంటే ఉసూరుమంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేప‌ట్టామని చెప్పారు. ఈ స్కూళ్ల ప‌రిధిలో ప‌నిచేస్తున్న‌ 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదే జిల్లాలో ఏర్పాటు చేయ‌బోతున్న మ‌రో 33 స్మార్ట్ కిచెన్ల ప‌రిధిలో ఏ ఒక్క‌రి ఉపాధికీ ఢోకాలేదని తెలిపారు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వ‌యంశ‌క్తి సంఘ మ‌హిళ‌ల‌కు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి క‌ల్పించ‌బోతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయ‌బోయే స్మార్ట్ కిచెన్ల‌తో ఉన్న‌వారితోపాటు అద‌నంగా వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తుంటే జగన్ ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు. పేద‌లు బాగుప‌డితే చూడ‌లేరా? అని అడిగారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేత‌నాలు చెల్లించ‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపణలు చేస్తున్నారని… అయితే వైఎస్సార్ కడప జిల్లాలో ప‌నిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ – 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశామని లోకేష్ తెలిపారు. మే నెలలో పాఠ‌శాల‌ల‌కు వేసవి సెలవుల కారణంగా గౌర‌వ వేత‌నాలు చెల్లింపు ఉండ‌దని… జూన్ నెల ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రి బ‌కాయిలు గురించి ఫేక్ ఆరోప‌ణ‌లు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. పేద పిల్ల‌ల‌కు మంచి భోజనం పెట్ట‌డం, ఆరోగ్యం ఉండ‌డం కూడా స‌హించ‌లేక‌పోతే ఎలా జ‌గన్ అని లోకేష్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *