అక్షర ఆయుధం : నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ను ఆదివారం (జూన్ 21) రోజున నిర్వహించనున్నారు. అయితే నాగ్‌పూర్‌కు చెందిన ఓ అభ్యర్థికి మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించడం తీవ్ర సంచలనం రేపింది. దీంతో నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలపై ఎన్టీఏ స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నాగపూర్‌కు చెందిన ఒక నీట్ యూజీ అభ్యర్థి పరీక్షా కేంద్రంగా నాగపూర్‌ను ఎంచుకున్నారు. అయితే పరీక్షా రాసేందుకు తన అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోగా… అందులో అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.జూన్ 21న జరగాల్సిన ప్రవేశ పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ సమస్య వెలుగులోకి రావడంతో… ఆ విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆందోళనలో చెందారు. అతను పరీక్షకు హాజరుకాగలడా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు.ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… అతడు నీట్ యూజీకి అప్లై చేసిన సమయంలో ఎగ్జామ్ సెంటర్‌కు సంబంధించి మొదటి ప్రాధాన్యత నాగ్‌పూర్‌ను, ఆ తర్వాత ప్రాధాన్యతలలో వార్ధా, భండారాలున ఎంచుకున్నారు. మే 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష కోసం ఆ విద్యార్థికి మొదట నాగపూర్‌లోని సరస్వతీ విద్యాలయంలో కేంద్రం కేటాయించబడింది. అయితే ఆ తర్వాత ప్రశ్నపత్రం లీక్ వివాదంతో ఆ పరీక్ష రద్దు చేసిన ఎన్టీఏ… జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టుగా తెలిపింది. అయితే తాజాగా జారీ చేసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుపై విదేశీ కేంద్రం పేరు ఉండటం చూసి తాము దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్ష కోసం తమ బిడ్డను విదేశాలకు పంపడం తమకు సాధ్యం కాదని… అతడికి పాస్‌పోర్టు కూడా లేదని చెప్పారు. అంతేకాకుండా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం కూడా లేదని అన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థి కుటుంబం ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయగా… వారు తమ పొరపాటును అంగీకరించారు. విద్యార్థి నివేదించిన అంశాలను ధ్రువీకరించిన తర్వాత సవరించిన అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.ఇక, మహారాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ అనీస్ అహ్మద్… ఈ సంఘటనను విమర్శించారు. ఇది పరీక్షా సంస్థ చేసిన తీవ్రమైన తప్పిదమని, విద్యార్థికి నాగ్‌పూర్ లేదా సమీప నగరంలో కేంద్రాన్ని కేటాయించడం ద్వారా ఈ పొరపాటును వెంటనే సరిదిద్దాలని ఎన్‌టీఏను కోరారు.మరోవైపు ఈ సమస్యపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ శనివారం స్పందించారు. నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడిన సమస్య పరిష్కరించబడిందని తెలిపారు. ఆ విద్యార్థికి వారి సొంత నగరంలోనే కేంద్రం కేటాయించబడిందని చెప్పారు.