పయనించే సూర్యుడు న్యూస్ : కన్నార్పకుండా అబద్దాలు… కులచిచ్చు రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటుగా మారింది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని వాటిని తిప్పికొడదాం అని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఘోరాలు చేస్తారు… ప్రజలను మభ్యపెట్టేందుకు గుళ్లు తిరుగుతారు అని ఎద్దేవా చేశారు. కన్నార్పకుండా అబద్దాలు ఆడడం… కుల చిచ్చు రాజేసి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలపైనా, ప్రభుత్వం మీద జరుగుతున్న కుట్రలు, దుష్ప్రచారంపై సీఎం స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గొడ్డలి పార్టీ లేనిపోని దుష్ప్రచారం చేస్తోంది. గొడ్డలి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని పని గట్టుకుని కుట్రలు పన్నుతున్నారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలను ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారు. కన్నార్పకుండా అబద్దాలు చెప్పటంలో గొడ్డలి పార్టీ నాయకుడు దిట్ట. అన్ని ఘటనలకూ కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారు. తప్పులు చేయడం…
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లకు అండగా గొడ్డలి పార్టీ
‘గత పాలకులు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కానీ డీఎస్సీ నియామకాలపై బురద చల్లుతున్నారు. పేపర్ లీక్ అయ్యిందని ఒకసారి, పోస్టులు ఇవ్వలేదని మరోసారి ఇలా లేని పోని దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల భర్తీపై సవాలు విసిరితే గొడ్డలి పార్టీ తోక ముడిచింది. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని గత పాలకులు అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని వారాలు గడిచినా పట్టించుకోలేదు. హామీ ఇవ్వకున్నా 10,800 మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ కు తీసుకువచ్చాం. ఈ నిర్ణయం వల్ల ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ.3 కోట్ల వరకూ ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగులకు మేలు చేయాలనే ఉధ్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
సీమకు ఏం చేశారో గొడ్డలి పార్టీ చెప్పుకోగలదా..?
‘సీమ ప్రజలకు ఏం చేసిందో గొడ్డలి పార్టీ సమాధానం చెప్పగలదా…? ప్రాజెక్టులు తెచ్చి, ఫ్యాక్షన్ అంతం చేసింది ప్రజా ప్రభుత్వమే. ఎన్జీటీలో స్టే వెకేట్ చేయించలేని వ్యక్తులు రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. నీళ్లు ఇస్తామని సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేశారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘సీమకు నీళ్లిచ్చే విషయంలో వారికి చిత్తశుద్ది లేదు. కనీసం ప్రాజెక్టు గేట్లు కూడా మరమ్మత్తులు చేయించలేక పోయారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చింది. కర్ణాటకతో కలిసి తుంగభద్రకు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం. 2019 తర్వాత విధ్వంస పాలన వల్ల ఏపీకి కోలుకోలేని నష్టం జరిగింది.