రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు సవాల్… ఆ పని చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాజీ మంత్రి

రేవంత్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటీఆర్... సంచలన సవాల్ విసురుతూ వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే, తెలంగాణ రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డల ఖాతాల్లో లక్షా యాభై వేల రూపాయల చొప్పున వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తాను రాజకీయాలు విడిచిపెట్టి పోతానని అన్నారు. ఈ సవాలు స్వీకరించడానిక రేవంత్ రెడ్డికి దమ్ముందా? అని ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములను లాక్కుంటుందని ఆరోపించారు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారని ఆరోపణలు చేశారు. పరిగిలో కూడా పారిశ్రామికవాడల పేరుతోని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా భూములు గుంజుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. లగచర్లలో రేవంత్ రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు. కేవలం రైతులు భూములు ఇవ్వనందుకే వారి పైన పోలీస్ కేసులు పెట్టించి, వారిపైన దాడులు చేయించి రేవంత్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. గిరిజన బిడ్డలను జైలులో పెట్టారని… కనీసం గుండెపోటు వస్తే, ఆయనకి వైద్యం అందించకుండా బేడీలు వేసి మరీ తిప్పించారని అన్నారు. పరిగి నియోజకవర్గంలో అడ్డగోలుగా అసైన్ భూములు పేదల నుంచి లాక్కుంటామంటే ఒప్పుకునేదే లేదని కేటీఆర్ అన్నారు. బాధిత పేద ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వాటికి పట్టాలు ఇచ్చి, పట్టాలకు ఇవ్వాల్సినంత నష్టపరిహారం ఇచ్చి, రైతుల అంగీకారంతోని భూములు సేకరించే ప్రయత్నం చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కలిసి చేస్తున్న ఈ భూముల అక్రమాలపైన ఖచ్చితంగా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉండి, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రెండేళ్ల కిందటే కిందనే చాలా స్పష్టంగా కాంగ్రెస్‌ని నమ్మొద్దని, నమ్మితే మోసపోతాము తెలంగాణ ఆగమయిపోతుందని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆనాడు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతన్నలకు రైతుబంధు ఇస్తామని చెప్పారని… పెన్షన్లు, పంటల బోనస్, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని చెప్పారని… ఇప్పుడు మాత్రం ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. కేవలం రైతన్నలకే కాకుండా 420 హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. పరిగి నియోజకవర్గానికి గ్రావిటీతోని కేసీఆర్ నీళ్లు తీసుకొస్తామంటే… రేవంత్ రెడ్డి 4,400 కోట్ల రూపాయలతోని ప్రత్యేకంగా ఒక స్కీమ్ తయారు చేసి కమీషన్ల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకమని ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న రేవంత్ రెడ్డి, కనీసం వారికి ఇస్తామన్న 2,500 రూపాయలు ఇస్తే లక్షాధికారులు అవుతారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఒక్కొక్క ఆడబిడ్డకి లక్షన్నర వారి బ్యాంకులో వేస్తే తాను శాశ్వతంగా రాజకీయల నుంచి వైదొలుగుతానని… ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి తన సవాలును స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకసారి మోసపోతే మోసం చేసినవాడి తప్పవుతుందని… కానీ పదే పదే కాంగ్రెస్ చేతిలో మోసపోకుండా మనం కలిసి కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దింపి… కేసీఆర్‌ను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో కలిసి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడితే, ఆ పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఒకవేళ అధికారం ఉంది కదా అని అరాచకాలు చేస్తే… ఖచ్చితంగా వారిని రిటైర్ అయిన తర్వాత కూడా తీసుకువచ్చి, చట్టపరంగా ప్రస్తుతం చేస్తున్న అరాచకాలకు అనుగుణంగా శిక్షిస్తామని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు దక్కాల్సిన గౌరవం, పదవుల అంశంలో తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *