పయనించే సూర్యుడు న్యూస్ : తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కుల కోసం ఎ. రేవంత్ రెడ్డి కేంద్రం చొరవ కోరారు, ఆర్డీఎస్ ఆనకట్ట భద్రత, పూడిక తొలగింపు, మూడు రాష్ట్రాల సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణకు తుంగభద్ర జలాల్లో రావాల్సిన హక్కు వాటాను పూర్తిస్థాయిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర జలాల వినియోగం, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిస్థితి, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర డ్యామ్ మరియు నది ప్రవాహాల ద్వారా తెలంగాణకు నికరంగా 15.9 టీఎంసీల నీరు అందాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఐదు నుంచి ఆరు టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాలోని దాదాపు 75 గ్రామాలకు చెందిన 83,987 ఎకరాల ఆయకట్టుకు సరిపడా సాగునీరు అందడం లేదని వివరించారు. తుంగభద్ర జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్నందున కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెరిగితే నీటి వినియోగం మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట పరిస్థితిపై కూడా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఆనకట్ట భద్రత పరంగా ప్రమాదకర స్థితిలో ఉందని అధికారులు వివరించగా, అత్యవసర మరమ్మతులు మరియు రక్షణ చర్యలను వెంటనే గుర్తించి అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ పనులపై సమీక్ష సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని వెల్లడైంది. ప్యాకేజీ-3, ప్యాకేజీ-4 పనులు పూర్తయినప్పటికీ, అత్యంత కీలకమైన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. నిలిచిపోయిన ఈ పనులను వెంటనే చేపట్టాలని, కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇక ఆర్డీఎస్ వద్ద తెలంగాణ వైపు భారీగా పూడిక పేరుకుపోవడం వల్ల నీటి మళ్లింపు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సిఫారసు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ సూచనలు అమలులోకి రాలేదని సమావేశంలో చర్చించారు. పూడిక తొలగింపు చర్యలను తక్షణమే ప్రారంభించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. అయితే పూడిక పేరుకున్న ప్రాంతం కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉండటంతో, ఆ రాష్ట్ర సహకారాన్ని కూడా కోరాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా 2004 నిపుణుల కమిటీ చేసిన అన్ని సూచనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పునఃపరిశీలించి అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని సీఎం సూచించారు. తాజా పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి వెంటనే అందజేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కూడా అధికారులకు సూచించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని పెంచి, సంబంధిత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, జూన్ 25 ఉదయం 11 గంటలకు కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా హోసపేటలో నిర్వహించనున్న తుంగభద్ర డ్యామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాసభలో కూడా ఆయన హాజరై ప్రసంగించనున్నారు. తుంగభద్ర జలాల వినియోగం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ, సాగునీటి అవసరాలపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృఢంగా ముందుకు సాగుతున్న సంకేతాలను ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.