జూన్ 28న పల్స్ పోలియో, తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు…

*ఆ రోజు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించకపోతే ఎలా?

జనం న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆ రోజు ఏదైనా కారణం చేత పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించకపోతే వారి కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం… తెలంగాణ వ్యాప్తంగా జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం రోజున జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని స్పష్టం చేశారు. జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహకు తెలిపారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ‘‘జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలి. గతంలో పోలియో చుక్కలు వేయించినా మరోసారి వేయించడం వల్లే పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి తెలంగాణ, దేశం పోలియో రహిత హోదాను కొనసాగిద్దాం’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదు అయిందని, పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని‌ ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. ఇదిలాఉంటే, జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సుమారు 40.97 లక్షల మంది 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *