అక్షర ఆయుధం : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) సర్వే ప్రక్రియ గురువారం (జూన్ 25) రోజున ప్రారంభమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. దీంతో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ నెల రోజుల పాటు, అంటే జూలై 24 వరకు కొనసాగనుంది. అంటే ఈ లోపు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. జూలై 31న ముసాయిదా ఎస్ఐఆర్ ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఓటరు పేరు లేకపోవడం లేదా ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అందిన అన్ని అభ్యంతరాలను సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తారని… వాటిని పూర్తి చేసే విధానాన్ని కూడా ఓటర్లకు తెలియజేస్తారని అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆన్లైన్ ద్వారా http://voters.eci.gov.in వెబ్సైట్లో కూడా సమర్పించవచ్చని చెప్పారు. ఎన్యూమరరేషన్ ఫామ్స్ పంపిణీ, సేకరణ కోసం బీఎల్వోలు ఇంటింటికీ వచ్చినప్పుడు ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీఎల్వోలు పంపిణీ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం…బీఎల్వోలు పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫామ్‌లో ఓటర్‌కు సంబంధించిన వివరాలు ప్రింట్ చేసి ఉంటాయి. ఆ కిందనే ఫామ్ పైభాగంలో రెండు కాలమ్‌లు కనిపిస్తాయి. మీకు 2002కు ముందే ఓటు హక్కు ఉంటే ఆ ఫామ్‌లోని ఎడమ వైపు కాలమ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే అప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న మీ బంధువుల వివరాలు అందజేయాలి.ఇక్కడ ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే), బంధువు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం వివరాలు అందజేయాలి.ఆ తర్వాత పుట్టినతేదీ, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షుని పేరు, తండ్రి/సంరక్షకుని ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటర్ ఫొటో గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే), జీవిత భాగస్వామి పేరు (వర్తిస్తే), జీవిత భాగస్వామి ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే) వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం ఎన్యూమరేషన్ ఫామ్ మీద సంతకం చేయడం లేదా వేలిముద్రను వేయడం చేయాలి.