అక్షర ఆయుధం : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను విశ్వసించరు… ప్రోత్సహించరు అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతీకార, హింసాత్మక రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు అని చెప్పుకొచ్చారు. కానీ నేరం చేసినవారు, చట్టాన్ని ఉల్లంఘించినవారు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే అని మంత్రి నారా లోకేశ్ అన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించదు అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించినవారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని హెచ్చరించారు. ‘రెడ్ బుక్ గురించి నేను బహిరంగంగానే మాట్లాడాను. ప్రతి బహిరంగ సభలో నేను రెడ్ బుక్‌ను చూపిస్తూ… చట్టాన్ని ఉల్లంఘించిన వారిని న్యాయస్థానాల ముందు నిలబెడతామని ప్రజలకు చెప్పాను. నిజంగా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకుని ఉంటే జగన్ ఈరోజు బయట ఉండేవారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను విశ్వసించరు. 44 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి రాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ నేరం చేసినవారు, చట్టాన్ని ఉల్లంఘించినవారు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు’అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.టీడీపీ కాలపరీక్షను తట్టుకుని నిలిచింది ‘తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా రాజకీయాల్లో కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. 1984లో ఇందిరాగాంధీ, సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్‌ను ఒక సాధనంగా ఉపయోగించి తొలగించారు. అంతకుముందు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు మారాయి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తిరిగి పునరుద్ధరించడం జరిగింది. దీనికి కారణం మా నాయకత్వం, మా కార్యకర్తల పట్టుదల. ఈ రోజు చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది’అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ అన్నారు.‘ఒక ప్రాంతీయ పార్టీగా మన సిద్ధాంతాల కోసం నిలబడాలి. మన కార్యకర్తల కోసం నిలబడాలి. ఆ నిబద్ధతను మరింత బలోపేతం చేయాలి. అనేక ఎన్నికలు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సిద్ధాంతాలను కోల్పోయిన కొన్ని పార్టీలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఎప్పుడూ తన సిద్ధాంతాల విషయంలో దృఢంగానే నిలిచింది. గతంలో మా పార్టీ ఎంపీలు ఫిరాయించినా మేం పోరాడాం, ప్రజల పక్షాన నిలిచాం. అందుకే 44 సంవత్సరాల తరువాత కూడా తెలుగుదేశం పార్టీ బలంగా నిలిచి ఉంది’అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడానికి పాదయాత్ర దోహదపడింది స్టాన్ఫోర్డ్ నాకు ఐక్యూ ఇచ్చింది.. పాదయాత్ర నాకు ఈక్యూ నేర్పింది. పాదయాత్ర నా రాజకీయ జీవితంలో ఎంతో కీలకమైంది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి అది నాకు చాలా ఉపయోగపడింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడాను. రెండు మూడు రోజులు అక్కడే గడిపాను. అందువల్ల ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దాంతో నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే నేను తరచూ చెబుతుంటాను.. వ్యాపారానికి స్టాన్ఫోర్డ్ ఎంబీయే ఎంత ఉపయోగపడిందో, రాజకీయాలకు పాదయాత్ర అంత ఉపయోగపడింది అని. స్టాన్ఫోర్డ్ నాకు ఐక్యూ ఇచ్చింది, పాదయాత్ర నాకు ఈక్యూ ఇచ్చింది. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనం అయ్యాయి ‘2019-2024 మధ్య వ్యవస్థల పతనాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను పుట్టినప్పటి నుంచే రాజకీయ వ్యవస్థను చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు 14 రోజుల తర్వాత నేను జన్మించాను. కార్యకర్తలు ఎలా పనిచేస్తారో, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించేవారో చిన్నప్పటి నుంచే చూశాను. కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో నేను తొలిసారిగా సంస్థాగత వ్యవస్థల పతనాన్ని చూశాను’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.‘నాపై 23 కేసులు పెట్టారు. అందులో హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నేను బాధ్యుల్ని చేయకపోతే, దీనికి అంతం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే కదా మనం ఎన్నికయ్యాం? 2019 నుంచి 2024 మధ్య జరిగిన విషయాలను యూట్యూబ్‌లో చూసినా తెలుస్తుంది’అని మంత్రి నారా లోకేశ్ గుర్తు చేశారు.‘కొన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు తన ఇంటి బయటకు కూడా రావడానికి అనుమతి ఇవ్వలేదు. పోలీసులు ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుకున్నారు. కానీ ఈరోజు జగన్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు. మేం ఎక్కడా అడ్డుకోవడం లేదు’అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.