జనం న్యూస్ : కూటమి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డిపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అవకతవకలను బయటపెట్టినందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పర్వత చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై దాడులు చేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డికి తాము అండగా ఉంటామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో, ప్రెస్‌మీట్‌లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పేరున్న విద్యా సంస్థలపై దాడి చేసిన ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. 16వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయమన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉండటమే ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా.? ఇదే సాంప్రదాయాన్ని రాబోయే వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ అండగా ఉంటుందని…. సోమవారం వైసీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయన్ను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారాడని..
పోలీసులను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ కూటమి నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తే అదే పోలీసులు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాడుకుంటే సమాజం ఎలా తయారవుతుందో చెప్పడానికి కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దుర్ఘటనలే సాక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి తెగబడుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై తనిఖీల పేరుతో దాడులకు పూనుకున్నారు. డీఎస్సీ-2025 నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకులు, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చుకున్నారని ఆధారాలతో సహా నిరూపిస్తూ వైసీపీ తరఫున తన గొంతు బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారాడని ఆయనపై కక్ష పెంచుకుంది. మండలిలో, ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే… మండలిలోనూ, బయటా ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండటం లేదు. దీంతో ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా నిన్న శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు తనిఖీల పేరుతో ఆయన నడిపించే 6 విద్యాసంస్ధలపై ప్రభుత్వ అధికారులు దాడులు చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 70కిపైగా విద్యాసంస్ధలుంటే వాటిని పట్టించుకోకుండా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలపై దాడులు చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్ల నుంచే ఆయనకి చెందిన విద్యాసంస్థలు నడిపే బిల్డింగులకు నోటీసులిచ్చారు. 2002 నుంచి ఏ సమస్యా లేనిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారికి తప్పుగా కనిపించడం రాజకీయ దురుద్దేశంతో చేసిన పనేనని ఎవరైనా చెబుతారు. వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడిగా ఉండటమే ఆయన చేసిన తప్పా? గతంలో ఎన్నడూ లేనిది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటున్నారు. ఆయన విద్యాసంస్థల్లో దాదాపు 16వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 500 మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తూ అంతపేరున్నవిద్యాసంస్థలపై దాడులు చేయడం హేయం.