సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికా, ఇరాన్‌లు తమ దేశాల మధ్య ఉన్న సంఘర్షణను ముగించి, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్దం ముగిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మూడు నెలలకు పైగా సాగుతున్న యుద్దం ముగిసింది. అమెరికా, ఇరాన్‌లు తమ దేశాల మధ్య ఉన్న సంఘర్షణను ముగించి, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇరుదేశాలు కూడా ఎలక్ట్రానిక్‌గా సంతకాలు చేశాయి. యుద్దం ముగింపు లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందంపై ఈ నెల 19 స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు రెండు రోజుల ముందుగానే అమెరికా, ఇరాన్‌లు… ఈ ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందంపై రిమోట్‌గా సంతకాలు జరిగాయని… ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చిందని అమెరికా అధికారులు ఆక్సియోస్‌కు తెలిపారు. ఇక, ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన విషయాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రెస్ టీవీతో మాట్లాడుతూ… ఈ అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు ఎలక్ట్రానిక్‌గా లాంఛనంగా సంతకాలు చేశాయని తెలిపారు. వైట్ హౌస్, ఇరాన్ అధికారుల ప్రకారం… ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లు సంతకాలు చేశారు. ఇక, అమెరికా అధికారుల ప్రకారం… ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో ఒక విందులో పాల్గొన్నప్పుడు ట్రంప్ బుధవారం ఈ పత్రంపై సంతకం చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య యుద్దానికి ముగింపు పడింది. అంతేకాకుండా, హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలను ఇరాన్ వెంటనే రీ ఓపెన్ చేయనుంది. ఇక, అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రధాన మధ్యవర్తులలో ఒకరిగా ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్… ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిపారు. ‘‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ఈ రోజు ఎలక్ట్రానిక్‌గా సంతకం చేయబడిందని ప్రకటించడానికి నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవగాహన ఒప్పందంపై ఇరు దేశాల గౌరవనీయ అధ్యక్షులు సంతకం చేశారు. మధ్యవర్తిగా నేను కూడా దీనిని ఆమోదించాను. ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుంది. మొదటి అడుగుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తక్షణమే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వెంటనే నావికా దిగ్బంధనాన్ని (ఇరాన్‌పై) ఎత్తివేస్తుంది’’ అని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇక, అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందంపై మొదట శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకం చేస్తారని భావించారు. అయితే మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్న ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త, చర్చల గురించి తెలిసిన ఒక మూలం ఆక్సియోస్‌తో మాట్లాడుతూ… ఒప్పందంపై సంతకం, అమలు రెండింటినీ ముందుకు తీసుకురావడం గురించి చర్చలు జరిగాయని చెప్పారు. ఇరుపక్షాలు ఇప్పటికే ఆ విషయంలో ఏకీభవించినందున, శుక్రవారానికి ముందే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి వీలుగా టైమ్ లైన్‌ను వేగవంతం చేశారని తెలిపారు. ఇక, ఈ ఒప్పంద పత్రం అమల్లోకి వచ్చినప్పటికీ… శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య సమావేశం జరగనుంది. న్యూస్‌నేషన్ ప్రకారం, అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించనుండగా, ఇరాన్ బృందానికి పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వం వహించనున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడంపై ఇరుదేశాల మధ్య సంప్రదింపులు దృష్టి సారించే అవకాశం ఉంది.