జనం న్యూస్ : ఇటీవల గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరివుతోంది. క్రెమ్లిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కీవ్ డ్రోన్లు ప్రయోగించి, తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో మాస్కోలో ఇంధన ఉత్పత్తి నిలిచిపోయి.. కొరత ఏర్పడింది. దీనిని అధిగమించడానికి పెట్రోల్‌ను భారత్ సహా పలు దేశాల నుంచి క్రెమ్లిన్ దిగుమతి చేసుకుంటోంది. గత రెండు రోజుల నుంచి భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ ఎగుమతి అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుని.. శుద్ధిచేసిన తర్వాత దానిని విదేశాలకు భారతీయ రిఫైనరీలు అమ్ముతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ఏర్పడిన ఇంధన కొరతను అధిగమించడానికి రష్యా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ నుంచి సముద్ర మార్గం ద్వారా గ్యాసోలిన్ (పెట్రోల్) దిగుమతి చేసుకోవడం ప్రారంభించిందని పరిశ్రమ వర్గాలు బుధవారం రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. ఇంధన కొరత రష్యాలోని 11 టైమ్ జోన్‌లకు విస్తరించింది. దీంతో ఇంధన రేషనింగ్ (పరిమితి సరఫరా), ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద భారీ క్యూలు, పెట్రోలు ధరలలో రికార్డు స్థాయి పెరుగుదల చోటుచేసుకున్నాయి. ఆమోదయోగ్యమైన ధరలకు ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశంపై పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు క్రెమ్లిన్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే రష్యాకు కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్‌ను భారత్ రవాణా చేసిందని ఒక పరిశ్రమ వర్గం తెలిపింది. ఒక్కొక్కటి 30,000 నుంచి 40,000 టన్నుల బరువున్న రెండు ట్యాంకర్లను పంపినట్లు మరో వర్గం వెల్లడించింది. రష్యాకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పొరుగున ఉన్న బెలారస్‌తో సహా పలు దేశాల నుంచి ప్రతి నెలా మొత్తం 400,000 టన్నుల గ్యాసోలిన్‌ను దిగుమతి చేసుకోవాలని రష్యా యోచిస్తోందని ఇంకో వర్గం పేర్కొంది. రష్యాలో వేసవి కాలంలో పెట్రోల్ వినియోగం రోజుకు కనీసం 1,10,000 టన్నులు ఉంటుంది. ఈ సమయంలో ఇంధన డిమాండ్ సాధారణంగా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే, రష్యాకు ఏ భారతీయ రిఫైనరీ పెట్రోల్‌ను సరఫరా చేస్తోందనే విషయం ఇంకా స్పష్టంగా లేదు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొన్ని ప్రాంతాలలో ఇంధన కొరతకు కారణమయ్యాయని, మంత్రులు, ఇతర అధికారులతో ఆదివారం జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయిటర్స్, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. బెలారస్ రైలు మార్గం ద్వారా రష్యాకు తన గ్యాసోలిన్ ఎగుమతులను గణనీయంగా పెంచింది. జూన్ మొదటి అర్ధభాగంలో సరఫరా 70,000 టన్నులకు చేరాయి. ఇది మే మొదటి అర్ధభాగంలో నమోదైన పరిమాణానికి దాదాపు మూడు రెట్లు. గత వారం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల ఏర్పడిన ఇంధన కొరతను ఎదుర్కోవడానికి వీలుగా రష్యా పార్లమెంట్ దేశ పన్నుల చట్టంలో సవరణలను ఆమోదించింది. ఈ చర్యలు భారత డెలివరీ ఖర్చులు, ధరల ఆధారంగా ఇంధన దిగుమతులపై సబ్సిడీలను కూడా అందిస్తాయి. ఇదిలా ఉండగా ఎల్ఎస్ఈజీ, కెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. జూన్‌లో రష్యా నుంచి భారత ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇతర వనరుల నుంచి సరఫరాలపై హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావాన్ని తగ్గించడానికి భారతీయ రిఫైనరీలు రష్యన్ క్రూడాయిల్ కొనుగోళ్లను పెంచాయి. కెప్లర్ ప్రకారం.. మేలో 36.5 శాతంతో పోలిస్తే, జూన్‌లో భారత మొత్తం చమురు దిగుమతులలో సగానికి పైగా రష్యా ముడి చమురు వాటా ఉంది. కప్లర్, ఎల్‌ఎస్‌ఈజీల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్.. జూన్ నెలలో రోజుకు సుమారు 2.70 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును పొందింది.