మహిళల విజయానికి ఏపీ పెద్ద అడుగు.. రూ.1,670 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం!

పయనించే సూర్యుడు న్యూస్ : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచింది. వారికి అండగా నిలవడంలో దేశంలో టాప్-1గా నిలిచి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచింది. వారికి అండగా నిలవడంలో దేశంలో టాప్-1గా నిలిచి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, మహిళలకు వ్యక్తిగత రుణాల పంపిణీలోనూ ఏపీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు వ్యక్తిగత ఎంటర్‌ప్రైజ్ రుణాలకు సంబంధించి నిర్దేశించుకున్న మొత్తంలో 99.7 శాతం అమలు సాధించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1,500 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా… రూ.1,495.50 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. 1.50 లక్షల మంది మహిళలకు రుణాల అందించాలని లక్ష్యం పెట్టుకోగా… 1,47,840 మందికి వ్యక్తిగత పారిశ్రామిక రుణాలు అందించింది. ఇక, 48,584 మందికి వ్యక్తిగత రుణాలు అందించిన తమిళనాడు… ఏపీ తర్వాత స్థానంలో నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పటికీ బీహార్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు… టార్గెట్స్‌లో కేవలం 15, 25 శాతం మాత్రమే చేరుకున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించడంలో అద్భుత పనితీరు కనబరుస్తుండడంతో… 2026-27 ఆర్థిక సంవత్సరానికి గతేడాదితో పోలిస్తే టార్గెట్‌ను పెంచుకుంది. 2026-27 ఏడాదికి 1.67 లక్షల మంది మహిళలకు రూ. 1670 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకంలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2025–26లో 35,934 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించింది. PMFMEలో 2025-26 ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 95 శాతం సాధించింది. ఇక, 35,210 మంది లబ్దిదారులతో PMFME స్కీంలో ఏపీ తర్వాతా స్థానాన్ని మహారాష్ట్ర దక్కించుకుంది. రుణాల పంపిణీతోపాటు, గ్రామీణ మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్రం ప్రశంసించింది. మహిళల ఆర్థిక సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర నివేదికలు పేర్కొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాపార నిర్వహణ, ఫైనాన్షియల్-డిజిటల్ లిటరసీ, నైపుణ్యాభివృద్ధిపై డ్వాక్రా మహిళలకు సెర్ప్ ప్రత్యేక శిక్షణ ఇప్పించిందని పేర్కొంది. డిజిటల్ మానిటరింగ్, ఎంఐఎస్ వ్యవస్థ, ఫీల్డ్ తనిఖీలతో మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాల మంజూరు చేయించే అంశంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్టుగా తెలిపింది. అలాగే, బ్యాంకులు కూడా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా రుణాలు మంజూరు చేసి మహిళలకు తోడ్పాటు అందించాయని పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉన్నట్టుగా తెలిపింది. అలాగే, గ్రామీణ పారిశ్రామికీకరణ, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, కుటుంబ ఆదాయాల పెంపులో ఆదర్శంగా కొనసాగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *