గాదె సాయికృష్ణ కేసులో తమిళనాడు తరహాలో దోషులకు ఉరిశిక్ష పడాలి

*మాజీ మంత్రి అంబటి రాంబాబు

జనం న్యూస్ : గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజును ఒక్కరినే దోషిగా చూపించి అసలు నిందితుల‌ను కాపాడే ప్రయత్నం జ‌రుగుతోంది అని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.గాదె సాయికృష్ణ కేసును నీరుగారిస్తే ఆ తల్లి ఆవేదనకు, సమాజానికి న్యాయం జరగదు అని చెప్పుకొచ్చారు. మెజిస్టీరియల్ విచారణ కాదు.. జ్యుడీషియల్ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తు జరగాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రభుత్వం చేపట్టిన మెజిస్టీరియల్ విచారణకు వైసీపీ ప్రతినిధుల బృందం హాజరై తమ అభ్యంతరాలు, అనుమానాలు, డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించింది. అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు నిందితులను కాపాడేందుకు సీఐ నాగరాజును ఒక్కరినే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమిళనాడు తరహాలో ఈ కేసులోనూ నిజమైన దోషులందరికీ ఉరిశిక్ష పడేలా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.సాయికృష్ణ కేసును నీరుగారిస్తే బాధిత తల్లికి, సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తూ, పూర్తి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది: మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హృదయవిదారక ఘటన. ఒక యువకుడిని పోలీస్ కస్టడీలో హింసించి చంపడమే కాకుండా, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి’అని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.‘ఈ కేసులో సీఐ నాగరాజును ఒక్కరినే దోషిగా చూపించి అసలు సూత్రధారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానాలను మేము మెజిస్టీరియల్ విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోలీస్ కస్టడీలో మరణం సంభవించినప్పుడు అదే రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించడం సమంజసం కాదు. అందుకే ఈ కేసులో జ్యుడీషియల్ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తు తప్పనిసరి’అని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.‘సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ డేటా, ఇతర ఆధారాలన్నింటినీ స్వాధీనం చేసుకుని వాస్తవాలను వెలికితీయాలి. కేసును నీరుగారిస్తే బాధిత తల్లి ఆవేదనకు, సమాజానికి న్యాయం జరగదు. తమిళనాడులో కస్టోడియల్ డెత్ కేసులో జరిగినట్లే ఈ కేసులోనూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవంగా పాల్గొన్న దోషులందరికీ ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా చట్టం ముందు నిలబడాల్సిందే. నిజాలు బయటపడి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం ఆగదు’ అని అంబ‌టి రాంబాబు హెచ్చరించారు. మెజిస్టీరియ‌ల్ విచార‌ణ‌పై న‌మ్మ‌కం లేదు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణలో మా అభ్యంతరాలు, అనుమానాలను లిఖితపూర్వకంగా సమర్పించాం. ప్రభుత్వం సీఐ నాగరాజును ఒక్కరినే బాధ్యుడిగా చూపించి కేసును ముగించే ప్రయత్నం చేస్తోందనే అనుమానాలు ఉన్నాయి. ఈ కేసు వెనుక ఇంకెవరు ఉన్నారో పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలి. మార్కాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ స్వాధీనం చేసుకుని బహిర్గతం చేయాలి. సాయికృష్ణను అదుపులోకి తీసుకురావాలని ఎవరు ఆదేశించారో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. సాయికృష్ణ కేసు రాజకీయాలకు సంబంధించినది కాదు.. ఇది పూర్తిగా మానవ హక్కులకు సంబంధించిన అంశం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కేసులో సిట్, మెజిస్టీరియల్ విచారణలపై మాకు నమ్మకం లేదు. అందుకే స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపి నిజమైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది” అని సుధాక‌ర్‌బాబు స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గం: మ‌ల్లాది విష్ణు మెజిస్టీరియల్ విచారణలో మా అభ్యంతరాలు, అనుమానాలను అధికారులకు సమర్పించాం. ప్రస్తుతం జరుగుతున్న సిట్, మెజిస్టీరియల్ విచారణలు కంటి తుడుపు చర్యలుగా కనిపిస్తున్నాయి. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలంటే స్వతంత్ర సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గం. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైసీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *