‘హర్మూజ్ మీ క్యాసినో కాదు’

ట్రంప్ బెదిరింపులకు ఇచ్చిపడేసిన ఇరాన్

పయనించే సూర్యుడు న్యూస్ : లెబనాన్‌లో కాల్పుల విరమణ కూడా ఇందులో భాగమే అయినా… బెంజిమిన్ నెతన్యాహు మాత్రం తగ్గడం లేదు. ట్రంప్ హెచ్చరికలను కూడా ఆయన పెడచెవిని పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో అగ్రరాజ్యాధినేత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తక్షణమే జల సంధిని తెరవాలని లేకుంటే ఇరాన్ ఉండదని ఆయన బెదిరింపులకు దిగారు. దీనిపై ఇరాన్ చట్టసభ నేత ఘాటుగానే బదులిస్తూ.. ఇది మీ క్యాసినో కాదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై దాడుల విషయంలో హెజ్బొల్లాను నిలువరించాలని, లేకుంటే భీకరదాడులు చేస్తామని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. ట్రంప్ కవ్వింపులపై ఇరాన్‌ ఘాటుగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్‌ జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్‌ ఇబ్రహీం అజీజి ఎక్స్‌ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు బెదిరిస్తాం.. మేం చర్యలు తీసుకుంటాం.. హర్మూజ్ జలసంధి మీ క్యాసినో కాదు.. సముద్ర దొంగలకు పెరడు కాదు.. జలమార్గం విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఇరాన్ ప్రజలు, సైన్యం చేతిలోనే ఉంది’’ అని ఇబ్రహీం స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంలో నిబంధనలు ఉల్లంఘన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు తెగబడటంతో హర్మూజ్‌ జల సంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ శనివారం ప్రకటించింది. ఇది ట్రంప్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇరాన్‌తో 60 రోజుల్లో తుది ఒప్పందం కుదరకపోతే హర్మూజ్‌లో టోల్‌ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు తాము అందించిన రక్షణ సేవలకుగానూ ఆ మొత్తాన్ని టోల్ ద్వారా వసూలుచేయనున్నట్టు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని ఇరాన్ సంప్రదింపుల బృందాన్ని ట్రంప్ బెదిరిస్తూ.. ఒకవేళ హర్మూజ్‌ను మూసివేస్తే ఇకపై ఇరాన్ ఉండదని, కనీసం తమ మాతృభూమికి కూడా తిరిగి వెళ్లలేరని అన్నారు. అయితే, ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. హర్మూజ్‌ మూసివేతతో వాణిజ్య నౌకల రాకపోకలు నెమ్మదించాయి. శనివారం 35 నౌకలు హర్మూజ్‌ను దాటగా… ఆదివారం ఈ సంఖ్య మరింత తగ్గి, 12 దాటినట్టు మారిటైమ్‌ ట్రాకింగ్‌ డేటా సంస్థ విండ్‌వర్డ్‌ తెలిపింది. ఈ నౌకల్లో కొన్ని ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థను నిలిపివేసి ప్రయాణించినట్లు పేర్కొంది. అయితే, ఈ ఉద్రిక్తతల పెరుగుదల అమెరికా నాయకుల్లో వైరుధ్యాలను స్పష్టం చేస్తుంది. ట్రంప్ బహిరంగ హెచ్చరించినప్పటికీ, అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. పశ్చిమాసియాలో సమగ్ర కాల్పుల విరమణను కొనసాగించాలని అధ్యక్షుడు స్పష్టంగా ఆదేశించారని గతంలో పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంపై గతవారం సంతకాలు జరిగిన విషయం తెలిసిందే.