
సాక్షి డిజిటల్ న్యూస్: మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలపై, రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై బహిరంగ చర్చలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ నేతలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఈ అంశంపై హరీష్, కేటీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ స్పష్టం చేశారు. అయితే తాము సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతి సవాల్ విసిరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ప్రెస్ క్లబ్‌కు వస్తారని మంత్రులు తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. తాము అవినీతి చేసినట్లు నిరూపిస్తే, ముగ్గురం మంత్రులం గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాస్తామని మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం లేదని... ఈ అంశంజై చర్చించేందుకు మాజీ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తే తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావుయ అక్కడి నుంచి పలువురు నేతలతో కలిసి గన్‌పార్క్ వద్దకు బయలుదేరేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్‌వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కమ్రంలోనే తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తాము మంత్రులు రమ్మని చెబితేనే గన్‌పార్క్ వద్దకు వెళ్తున్నామని హరీష్ రావు అన్నారు. తమను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. పోలీసులను పెట్టి తమను అడ్డుకుంటే... వారు పారిపోతున్నట్టే లెక్క అని అన్నారు. అన్ని ఆధారాలతో చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసిన వారు ఎత్తడం లేదని అన్నారు. కావాలంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేయాలని పోలీసులకు సూచించారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. దీంతో కేటీఆర్ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.