సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. హీరో మోటో కార్ప్, జీ రాంజీ, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనల సందర్భంగా ఆయా జిల్లాల్లో చంద్రబాబు బస చేయనున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. జూలై 1 నుంచి 5వరకు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగనుంది.జిల్లా పర్యటనల్లో పలు సంక్షేమ, అభివృద్ది కార్యమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. జూలై 1న పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఆరోజు రాత్రికి అక్కడే బస చేస్తారు.జూలై 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాం జీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్లో జరిగే జీఎస్ డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్‌నకు నీతి ఆయోగ్ సభ్యులతోపాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. జూలై 2వ తేదీ రాత్రి తిరుపతిలోనే సీఎం చంద్రబాబు నాయుడు బస చేస్తారు. జూలై 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడినుంచి సీఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళతారు. సీఎం చంద్రబాబు నాయుడు… జూలై 3 నుంచి 5 వరకు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సీఎం చంద్రబాబు తిరిగి జూలై 5న అమరావతికి చేరుకుంటారు.