
అక్షర ఆయుధం ; ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు . తన వ్యాఖ్యలను వక్రీకరించి సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పూర్తిగా పక్కనబెట్టి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా తెలిపారు. తను సాయిబాబా భక్తుడిని అని చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమాపణ కోరుతున్నాని పేర్కొన్నారు. "నేను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడిని. ప్రతిరోజూ ఉదయం నా పూజా మందిరంలో వివిధ దేవతామూర్తులతో పాటు గురుపీఠంపై కొలువై ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే నా దినచర్యను ప్రారంభిస్తాను. సాయిబాబా పట్ల నాకు అత్యంత గౌరవం, భక్తి ఉన్నాయి.నా వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుని మనోభావాలు దెబ్బతిని ఉంటే, వారిని హృదయపూర్వకంగా మన్నించమని కోరుతున్నాను" అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ, తిరుమల తిరుపతి దేవస్థానాలు గానీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదనీ మంత్రి ఆనం తెలిపారు. అలాగే ఎవరైనా ఆరాధించే మహనీయులను కించపరచే ఉద్దేశం కూడా తమకులేదని అన్నారు. .సాయిబాబా పట్ల కోట్లాది మంది భక్తులకు అపారమైన విశ్వాసం ఉందని చెప్పారు. ఆ విశ్వాసాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని తెలిపారు. "సాయిబాబా ఆలయాల్లో పూజలు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతున్నాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.అయితే టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న 5,000 భజన మందిరాలు నిర్మాణ కార్యక్రమానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం" అని మంత్రి ఆనం పేర్కొన్నారు.