
పయనించే సూర్యుడు న్యూస్ : వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాట్సప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టడం కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాట్సప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టడం కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌పై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కేంద్రం ఆదేశించింది. అలాగే, ఇందుకు సంబంధించి సంప్రదింపులు పూర్తయ్యేవరకు వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టవద్దని మెటాను కేంద్రం ఆదేశించింది. అయితే ఇటీవలికాలంలో మోసాలు, నకిలీ ఖాతాల ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ ప్రతిపాదించిన యూజర్‌నేమ్ ఫీచర్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, నియమాలను కూడా కేంద్రం విశ్లేషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెసుకోవడానికి మెటాకు కేంద్రం నోటీసులు పంపించింది. తద్వారా వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టడం వల్ల చోటుచేసుకోనే ప్రభావాలు, కంపెనీ ప్రణాళికలపై కేంద్రం వివరాలు సేకరించనుంది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి కొన్ని ఆందోళనల నేపథ్యంలో... చట్టబద్ధమైన అధికార సంస్థగా కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు లేవని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్ స్పందన సంతృప్తికరంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టకుండా నిరోధించే అవకాశం ఉందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. వారు హామీ ఇచ్చి, ఒప్పించగలిగితే తప్ప ముందుకు వెళ్లలేరని ఆ వర్గాలు తెలిపాయి. ఇక, మెటా యాజమాన్యంలోని వాట్సాప్… యూజర్‌నేమ్స్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్స్ తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు షేర్ చేయకుండానే… కేవలం యూజర్‌నేమ్ ద్వారా చాట్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రూప్ చాట్లలో లేదా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఫోన్ నంబర్ కనిపించకుండా దాచడం ద్వారా యూజర్ల ప్రైవసీ పెరుగుతుందని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను ఈ ఏడాది చివర్లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అయితే యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చని వాట్సాప్ ప్రకటించింది. యూజర్ నేమ్‌లో 3 నుంచి 35 క్యారక్టర్లను అనుమతించనున్నట్టుగా తెలిపింది. యూజర్‌నేమ్‌గా సెలబ్రిటీలు, అత్యున్నత స్థాయి వ్యక్తుల పేర్లను వాట్సాప్ అనుమతించదు.
కేంద్ర ప్రభుత్వ ఆందోళన ఏమిటి?
వాట్సాప్‌లో తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కొందరు సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసగాళ్లు ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ సంస్థలు లేదా వ్యక్తుల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లను పోలిన వాటిని క్రియేట్ చేసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. తద్వారా నకిలీ గుర్తింపుతో మోసాలకు ఆస్కారం కలుగుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ కొత్త ఫీచర్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. వాట్సాప్ తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్... ప్రజా భద్రత, సమాజంపై ప్రతికూల ప్రభావాలను చూపకుండా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి వివరణ కోరుతూ మెటాకు నోటీసులు జారీ చేసింది. తద్వారా జాతీయ భద్రత, ప్రజా రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, వాట్సాప్‌కు భారతదేశంలో సుమారు 50 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు.