
జనం న్యూస్ : తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌లోని జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్‌లతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని... ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని అన్నారు. అయితే మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ వినియోగానికి కేంద్ర జల సంఘం సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ… ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని… ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని గురువారం (జూన్ 25) రోజున కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద తమకు హక్కుగా ఉన్న నీటి వాటాను కాపాడుకోవడానికి తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాలను గుర్తించాలని ఈ సమావేశం తీర్మానించింది. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన విధంగా నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. 2004 లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించిందని తెలిపారు. దీంతో ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికి అమలు కాలేదని ఈ సమావేశంలో చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు.