ప్రజలు కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేయరని కేటీఆర్ అభిప్రాయం

సాక్షి డిజిటల్ న్యూస్: రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలు అవినీతి కుంభకోణాలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని...తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ నంది‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు.ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు బీజేపీ కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని అన్నారు. నిన్న వేయి రూపాయలకు పైగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరనే ఇందులో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అని కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వలన ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాల పైన బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడి నాయకులు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచకుండా ఉండడంతోపాటు నిన్న పెంచిన సిలిండర్ ధర పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన సిలిండర్ ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దొంగఓట్ల నమోదును అడ్డుకోండి త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రతి ఒక్క యువకుడికి, యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కేటీఆర్ సూచించారు. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.