
దేశ రాజధాని ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళ్లిన ఎయిరిండియా విమానం ఒకటి.. దాయాది గగనతలంలోకి ప్రవేశించింది. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఎయిరిండియా సంస్థ బుధవారం ప్రకటించింది. దీని గురించి అధికార యంత్రాగానికి నివేదించినట్టు తెలిపింది. నిర్దేశిత మార్గం దాటి పాక్ గగనతలంలోకి విమానం వెళ్లిన విషయం.. ఇస్లామాబాద్ ఏటీసీ సిబ్బంది హెచ్చరికల తర్వాతే పైలట్ గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే విమానం వెనక్కి మళ్లించారు. ఢిల్లీ- అమృత్‌సర్ ఎయిరిండియా విమానం కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేగుతోంది. సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న విమానం.. విమానాశ్రయంలో గో-అరౌండ్ విన్యాసం నిర్వహిస్తున్నప్పుడు కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిందని ఎయిరిండియా సంస్థ తెలిపింది. ఈ ఘటనను రెగ్యులేటరీ అథారిటీకి నివేదించామని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఎయిర్‌లైన్ తెలిపింది. ‘‘జూన్ 22న ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న ఏఐ 479 విమాన సిబ్బంది, అమృత్‌సర్ విమానాశ్రయంలో గో-అరౌండ్ విన్యాసం చేస్తుండగా స్వల్పంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించారు. ఈ ఘటనను నియంత్రణ సంస్థలకు నివేదించాం.. అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని నొక్కి చెప్పింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఏం జరిగింది? అనేది నిర్దారణకు రానున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇలా జరిగింది? లేక పొరపాటున ప్రవేశించారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌బస్ విమానం ఏఐ-321 సోమవారం రాత్రి సుమారు 9:18 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ విమానం రాత్రి సుమారు 10:30 గంటలకు అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ప్రయాణ సమయంలో ఆ విమానం తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు మళ్లి, కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ నుంచి విమానానికి హెచ్చరికలు రావడం ప్రారంభమైన తర్వాతే పైలట్‌కు ఈ విషయం తెలిసిందని వర్గాలు తెలిపాయి. విమానం తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు మళ్లిందని ఆ హెచ్చరికలు సిబ్బందిని అప్రమత్తం చేశాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న ఈ సున్నిత సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ప్రయాణికుల విమానం కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడం విమానయాన అధికారులలో ఆందోళనలను రేకెత్తించింది. అమృత్‌సర్ విమానాశ్రయాన్ని నిర్వహించే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులు, ప్రయాణ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య కూడా తలెత్తిందని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా, స్థానిక విమానాశ్రయ కంట్రోల్ రూమ్, అమృత్‌సర్‌కు ప్రయాణాన్ని కొనసాగించకుండా ఢిల్లీకి తిరిగి రావాలని విమానానికి సూచించింది. విమానం ఢిల్లీలో సురక్షితంగా తిరిగి ల్యాండ్ అయింది. అవసరమైన తనిఖీలు, అనుమతులు పొందిన తర్వాత, దాదాపు రెండు గంటల తర్వాత విమానం మళ్లీ అమృత్‌సర్‌కు బయలుదేరింది. అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 2:20 గంటలకు విమానం చివరకు అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.