
సాక్షి డిజిటల్ న్యూస్: కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మంత్రులు చెప్పడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన అనధికారిక మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మంత్రులు చెప్పడంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ... కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని సమావేశం భావించినట్టు మంత్రులు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. అయితే దీనిపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని అన్నారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 'డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ' తో రైతుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పాత విధానంలో కొనుగోళ్లు కాకుండా కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే ధాన్యం కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడానికి చేతకాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు సీఎం హోదాలో ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నాడని ప్రశ్నించారు. పంటలు కొనుగోలు చేయమని తమ చేతగాని తనాన్ని రాష్ట్ర కేబినెట్ మీడియా సాక్షిగా ఒప్పుకుందని అన్నారు. రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనకపోతే, పండిన పంటను రైతులు ఏం చేయాలి? ఇంట్లో దాచుకోవాలా? అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల బతుకులతో ఆడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? అని అడిగారు. కేంద్ర కోటాల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనని అన్నారు. పంట బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగు పై ఆంక్షలు విధించడమేనని హరీష్ రావు అన్నారు. పంట మార్పిడి చేయండి అన్న ప్రభుత్వ మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, శనిగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందని ఆరోపించారు. ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రైతన్నను రాజుగా చేస్తే, రేవంత్ రెడ్డి దివాళా తీసే కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ రైతుకు తీరని ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.