నిర్వాసితులకు న్యాయం చేస్తాం… వెలిగొండ పూర్తి చేస్తాం… నాదీ గ్యారెంటీ

నిర్వాసితులకు న్యాయం చేస్తాం... వెలిగొండ పూర్తి చేస్తాం... నాదీ గ్యారెంటీ: సీఎం చంద్రబాబు నాయుడు

జనం న్యూస్ : ‘నిర్వాసితులకు న్యాయం చేస్తాం... వెలిగొండ పూర్తి చేస్తాం... నాదీ గ్యారెంటీ’అని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధి రైతులు, నిర్వాసితులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధుల చెక్కును అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా... ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని సీఎం చంద్రబాబు తెలిపారు.ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాము పాలన చేపడుతున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని.. అలాగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ఇందుకు తనది గ్యారెంటీ ఆంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2,351 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిమిత్తం రూ.300 కోట్ల విలువైన చెక్కును ముఖ్యమంత్రి అందించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర... మార్కాపురం జిల్లా అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే ‘ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే. పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి.. దీంతో ఇక్కడి స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘మార్కాపురం ప్రాంతం అంటే కరవు ప్రాంతమని పేరు... ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేశారు... దీని కోసం ఓ కమిటీని వేశారు. ఎన్టీఆర్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1995లో ప్రకాశం జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా వెలిగొండ ప్రాజెక్టు గురించే అడిగేవాళ్లు. వరద వస్తే.. ఆ జలాలను మళ్లిస్తే ఆ నీళ్లతో తాము జీవనం సాగిస్తామని ఇక్కడి రైతులు చెప్పేవారు’అని గుర్తు చేశారు. ‘1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాం. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశాం... ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. రూ.1,932 కోట్లు తొలి విడతలో ఖర్చు పెట్టాలి... రూ.1906 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. 2024లో ప్రభుత్వం వచ్చాక రూ.759 కోట్లు ఖర్చు చేశాం... నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి రూ.300 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం బ్యాంకులకు శెలవులు ఉన్నందున మరో రెండు రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో ఆర్ అండ్ ఆర్ డబ్బులు జమ అవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి... అయినా వెలిగొండ సహా వివిధ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ ‘ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాలు మెరుగ్గా ఉంటాయి. 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం. కొత్తగా నిర్మించబోయే కలెక్టరేట్ పక్కన కొన్ని గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతోపాటు.. నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం... నిర్వాసితుల కాలనీల్లో మౌళిక సదుపాయాలు పూర్తి చేశాం. నిర్వాసితుల త్యాగం వల్ల 4.47 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 23 లక్షల మందికి తాగునీరు లభిస్తాయి. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా ఈ సీజన్ లో నీళ్లను అందిస్తాం. ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తాం. ఫేజ్-2 కింద 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించాం ‘వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్ర. ఈ ప్రాజెక్టు లబ్దిదారులతోపాటు.. నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. హైదరాబాద్ నగరంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కోట్లాది రూపాయలు గడించారు.