
పయనించే సూర్యుడు న్యూస్ : శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే కింది సేవల కారణంగానే జూలై 14, 17వ తేదీల్లో పలు దర్శనాలను రద్దు చేశారు. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న కొన్ని ప్రత్యేక సాంప్రదాయ కార్యక్రమాల నేపథ్యంలో జులై 14 మరియు జులై 17వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు నేపథ్యంలో వాటికి సంబంధించిన సిఫార్సు లేఖలపై కూడా టీటీడీ స్పష్టతనిచ్చింది. బ్రేక్ దర్శనాలు రద్దయిన రోజులకు ముందు రోజైన జులై 13, 16వ తేదీలలో ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరింది.
దర్శనాల రద్దుకు గల కారణాలు
శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే కింది సేవల కారణంగానే ఆయా రోజుల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. జులై 14న శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' (ఆలయ శుద్ధి కార్యక్రమం) జరగనుంది. జులై 17న ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే 'ఆణివార ఆస్థానం' వేడుకలు జరగనున్నాయి.
జులై 17న పలు ఆర్జిత సేవలు కూడా రద్దు!
జులై 17న ఆణివార ఆస్థానం జరగనున్న నేపథ్యంలో, ఆ రోజున ఆలయంలో నిర్వహించే పలు ప్రధాన ఆర్జిత సేవలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీటిలో శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నాయి. ఈ నిర్దేశిత రోజుల్లో సాధారణ భక్తులకు దర్శన సమయాన్ని మెరుగుపరిచేందుకు, ఆలయ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.