టెలిగ్రామ్‌పై బ్యాన్‌ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

అక్షర ఆయుధం : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ షాక్‌ తగిలింది. జూన్ 22 వరకు టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా సమర్థించారు. వివరాలు... భారతదేశంలో టెలిగ్రామ్ కార్యకలాపాలపై ఈ నెల 22 వరకు నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలను ఆ కంపెనీ సవాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటివకే అన్ని పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే తాజాగా తీర్పును వెలువరించింది. అన్ని వాదనలు పరిశీలించామని... పరిస్థితి అత్యవసర స్వభావం దృష్ట్యా టెలిగ్రామ్‌ యాక్సెస్‌ను పరిమితం చేసేందుకు ప్రభుత్వం అందించిన కారణాలు సరిపోతాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు సరైన ఆధారాలతో, కారణాలతో ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. టెలిగ్రామ్‌కు యాక్సెస్ నిరోంధించేలా ఆదేశించే అధికారం ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు అతి తక్కువ ఆంక్షలతో కూడినవని... ఈ ఉత్తర్వు అసమానమైనదని చెప్పలేమని కూడా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.ఇక, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకూ టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫాం యాక్సెస్‌పై నిషేధం ఉంటుందని, 30వ తేదీ వరకూ మెసేజ్‌ ఎడిటింగ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఇదిలాఉంటే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY)… ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్‌ 69ఏ కింద దేశంలో టెలిగ్రామ్‌ను నియంత్రిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) ఇచ్చిన నివేదికలు, సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నీట్-యూజీ వివాదంతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత మోసపూరిత నెట్‌వర్క్‌లు టెలిగ్రామ్‌ను ఉపయోగించుకున్నాయనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. ఈ నెల 22 వరకూ టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫాం యాక్సెస్‌పై నియంత్రణ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే, మెసేజ్-ఎడిటింగ్ ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్‌ను కేంద్రం ఆదేశించింది.