
జనం న్యూస్ : రైతు భరోసా నిధుల విడుదల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా నిధుల విడుదలను ఈనెల 30న ప్రారంభించినట్టుగా తెలిపింది. తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదల విడుదలపై కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా నిధుల విడుదలను ఈనెల 30న ప్రారంభించినట్టుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘వానా కాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించడం జరుగుతుంది. రైతులు పండించే ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి BPT 5204, RNR 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, KNM 7715 రకాలకు వానా కాలం సీజన్లొ బోనస్ ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపారు. తెలంగాణ రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇకపై కేంద్రం ఏయే పంట ఉత్పత్తులకు MSP నిర్ణయించి, కొనుగోలు చేస్తుందో.. ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నమని తెలిపారు. వానాకాలం సీజన్ కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారని చెప్పారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఐఆర్ఎఫ్సీ నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరారు.