జనం న్యూస్ : పరిమల్ నత్వానీ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జార్ఖండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన విజయం సాధించారు. పరిమల్ నత్వానీ ఎన్నిక జార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పరిమల్ నత్వానీ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జార్ఖండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు జార్ఖండ్‌లోని అధికార జేఎంఎం కూటమిలో విభేదాలను తెరమీదకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక్క రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి కనీసం 28 ఎమ్మెల్యేల 'మొదటి ప్రాధాన్యత' ఓట్లు అవసరం ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో అధికార జేఎంఎం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పార్టీలు 56 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 24 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే, జేఎంఎం, కాంగ్రెస్ కూటమి రెండు స్థానాలు కైవసం చేసుకోవడానిక సరిపడ బలం ఉంది. మరోవైపు బీజేపీ ఒక్క రాజ్యసభ స్థానం కైవసం చేసుకోవాలంటే మరో నాలుగు ఓట్లు తక్కువగా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణవ్, జేఎంఎం అభ్యర్థిగా వైద్యనాథ్ బరిలో నిలిచారు. అయితే ఇక్కడే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్డీయే కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పరిమల్ నత్వానీ బరిలో నిలిపింది. రెండు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే ఓటు చెల్లనిదిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిగిలిన 78 ఎమ్మెల్యే ఓట్లు చెల్లుబాటు అయినట్టుగా తేలింది. ఇందులో జేఎంఎం అభ్యర్థి వైద్యనాథ్ 30 ఓట్లు సాధించి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే, మరో స్థానానికి ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిమల్ నత్వానీ 28 ఓట్లతో విజయం సాధించారు. 20 ఓట్లు పొందిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఓటమి చెందారు. దీంతో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం పరిమల్ నత్వానీకి కలిసి రాగా… అధికార కూటమిలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి దీపికా పాండే స్పందిస్తూ... ద్రోహం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కె రాజు మాట్లాడుతూ... తమ పార్టీ ఓటమికి కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కారణమని ఆరోపించారు. ‘‘ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌లు మాకు ద్రోహం చేశాయి. వారు మాకు ఓటు వేయలేదు, అందుకే మేము ఓడిపోయాము. మాకు జేఎంఎం నుంచి నాలుగు ఓట్లు లభించాయి. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ మా అభ్యర్థికి అనుకూలంగానే ఓటు వేశారు’’ అని రాజు పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ఈ ఫలితం కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతుందా? అని అడిగినప్పుడు... తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో చర్చిస్తానని రాజు అన్నారు. మరోవైపు బీజేపీ కోడెర్మా ఎమ్మెల్యే నీరా యాదవ్ ‘‘జై శ్రీరామ్, పని పూర్తయింది’’ అని పేర్కొన్నారు. ఇక, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు ఆదిత్య సాహు... పరిమల్ నత్వానీ విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. శాసనసభ్యులు వారి మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేశారని అన్నారు. ‘‘మా పార్టీ రెండు ఓట్లు చెల్లనివి అయినప్పటికీ... నత్వానీ 28 ఓట్లు సాధించారు. ఇది ఒక పెద్ద విజయం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇండి కూటమిలోని సభ్యులు కూడా విశ్వాసం చూపించారు’’ అని ఆదిత్య సాహు అన్నారు. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందనే ఆరోపణలను తోసిపుచ్చారు.