కుప్పం అభివృద్ధికి కొత్త అధ్యాయం.. భారీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సందేశం

పయనించే సూర్యుడు న్యూస్ : కుప్పం ప్రజలే తనకు శ్రీరామరక్ష అని ఎక్కడ ఉన్నా తన ఆలోచనలు కుప్పంపైనే ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కుప్పానికి రావడం చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసినప్పుడు కంటే మించిన సంతోషం కుప్పంలో కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పానికి ప్రపంచస్థాయి పెట్టుబడులు, అత్యాధునిక పరిశ్రమలకు గమ్యస్థానంగా వేగంగా రూపుదిద్దు కుంటోందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ వరకు కుప్పానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. గుడుపల్లె మండలం పొగురుపల్లిలో శుక్రవారం నిర్వహించిన 'స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అదే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) సమక్షంలో పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలకు మార్గం సుగమం చేసే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయని ప్రకటించారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ పరిశ్రమలను కుప్పానికి తీసుకురావడమే తన లక్ష్యమని, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో పరిశ్రమలకు ఒకేసారి శ్రీకారం చుట్టడం అంతకంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు..

.

కుప్పం చరిత్రలో ప్రత్యేక ఘట్టం

కుప్పం ప్రజలే తనకు శ్రీరామరక్ష అని ఎక్కడ ఉన్నా తన ఆలోచనలు కుప్పంపైనే ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో పరిశ్రమలు కుప్పానికి రావడం చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని...ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. 44 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కులో 167 పారిశ్రామిక ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయని, యువత కాలేజీ దశ నుంచే ఉద్యోగాల కోసం కాకుండా వ్యాపార అవకాశాల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 1.49 లక్షల మంది డ్వాక్రా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని గుర్తుచేశారు. కుప్పం జీఎస్‌డీపీ 38 శాతం పెరిగిందని, తలసరి ఆదాయం రూ.2.11 లక్షలకు చేరిందని ముఖ్యమంత్రి తెలిపారు. హంద్రీ–నీవా ద్వారా సాగునీరు, డ్రిప్ ఇరిగేషన్, పాల ఉత్పత్తి పెరిగాయని, గండికోట నుంచి మరింత నీరు తీసుకొచ్చి తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పంలో 70 శాతం గ్రీన్ కవర్‌ను పరిరక్షిస్తూ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని, పీ4 కార్యక్రమం ద్వారా ఇప్పటికే 8 వేల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పొగురుపల్లిలో అత్యుత్తమ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని, అభివృద్ధిని అడ్డుకునే శక్తులను ప్రజలు తిరస్కరించాలని సూచించారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం..ఇప్పుడు ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడులకు పోటీ పడుతున్న ప్రాంతంగా మారింది. ఫుట్‌వేర్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ వరకు, బ్యాటరీల నుంచి బయోటెక్ వరకు, ప్రపంచ స్థాయి పరిశ్రమలు కుప్పానికి రావడం ఈ ప్రాంత భవిష్యత్తును మారుతుందన్నారు. రాబోయే రోజుల్లో కుప్పాన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక, ఉపాధి, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

శంకుస్థాపన రోజే ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించండి

శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఆయా సంస్థల పురోగతి, ఉత్పత్తులు, పెట్టుబడులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇస్తూ శంకుస్థాపన జరిగిన రోజునే ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసుకుని ఆ లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనతో పలు కంపెనీల ప్రతినిధులు వేదికపైనే తమ పరిశ్రమల ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన సహకారం చూసిన తర్వాత ప్రాజెక్టులను మరింత త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహం కలిగిందని పారిశ్రామికవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.