
సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మావిగన్‌కు మద్దతు తెలుపాలని అనుకున్నవారు వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ బుధవారం రోజున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికలలో అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే పోరు అని అన్నారు. మావిగన్ అనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారు. మావిగన్‌కు మద్దతు తెలుపాలని అనుకున్నవారు వైసీపీకి ఓటు వేయాలని, అమరావతికి అనుకూలంగా ఉన్నవారు చంద్రబాబుకు ఓటు వేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే అజెండాతో వెళ్తామని... మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని చేరుస్తామని అన్నారు. ప్రజలు ఎలా ఓటు వేస్తారనేది చూద్దామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే, తాను అమరావతికి వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ అన్నారు. రైతులకు సానుభూతిపరుడినని పేర్కొన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంను వారి తరఫున ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఇక, ప్రెస్ మీట్ చివరలో గతంలో వైజాగ్ రాజధానిగా ముందుకు సాగుతామన్న వైసీపీ నినాదంపై ప్రశ్నించగా... జగన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పటికే ఆయన ప్రెస్ మీట్ ముగించే మూడ్‌లో కనిపించారు. ఇక, గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ది వికేంద్రీకణ పేరుతో మూడు రాజధానుల నినాదంతో ముందుకు సాగిన సంగతి తెలిసిందే. వైజాగ్ పరిపాలన రాజధానిగా పాలన సాగించాలని అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ భావించారు. అయితే అది సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్ అని వైఎస్ జగన్ పలుమార్లు ఆరోపించారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదని... అది సాధ్యమవుతుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. ఆ తర్వాత 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది అధికారం కోల్పోయింది. అయితే తాజాగా కొన్ని నెలల కిందట ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే రాజధాని అంశంపై వైఎస్ జగన్ సరికొత్త డిమాండ్ తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని వైఎస్ జగన్ కోరారు. మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VI, గుంటూరు నుంచి GUN తీసుకుని… MAVIGUN(మవిగన్) అని పేరు పెట్టాలని కూడా అన్నారు. చెన్నై పోర్టు సిటీ, ముంబై పోర్టు సిటీ… ఏపీ రాజధాని కూడా పోర్టు సిటీగా ఉండేలా తాము ప్లాన్ బీ సూచించామని చెప్పుకొచ్చారు.మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కి.మీ. విజయవాడ నుంచి గుంటూరుకు 40కి.మీ... ఈ ప్రాంతం మొత్తం 110 కి.మీ హైవే ఉందని... ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... మావిగన్ నినాదంతో ముందుకు సాగుతుంది. అయితే తాజాగా వైఎస్ జగన్... రాష్ట్ర రాజధానిగా మావిగన్ ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని మరోసారి స్పష్టం చేశారు. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరుతామని కూడా చెప్పుకొచ్చారు.