ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి  ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రోజున కర్నూలు జిల్లా మంత్రాలయంలో పర్యటించారు. మంత్రాలయం మండలం మాధవరంలో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...టీడీపీకి కార్యకర్తే అధినేత అని, వారి సంక్షేమం, అభివృద్ది పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకులు కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఎలాంటి వర్గ విభేదాలు ఉండకూడదని స్పష్టం చేశారు. తిక్కారెడ్డి లేదా రాఘవేంద్ర రెడ్డికి మద్దతుగా ప్రత్యేక వర్గాలేవీ లేవని పేర్కొన్నారు. ఐక్యంగా చేసే ప్రయత్నాలు మాత్రమే విజయాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డికి పూర్తి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిక్కారెడ్డి సేవలను రాష్ట్ర స్థాయిలో వాడుకుంటామని తెలిపారు. తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలు కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో రెండో వర్గం ఉండకూడదని స్పష్టం చేశారు. 2029లో మంత్రాలయంలో మన విజయాన్ని ఎవరూ ఆపలేరని కార్యకర్తలతో అన్నారు. రాఘవేంద్రరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని అన్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలు అందుతున్నాయా? లేదా? అనే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఉన్న సమస్యలను పార్టీ పరంగా ఏమైనా పరిష్కరించవచ్చా? అనే కోణంలో కూడా ఆలోచన చేయాలని సూచించారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడినవారిని పక్కన పెట్టేస్తానని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓడిపోయినవారి స్థానంలో మరొకర్ని నియమిస్తానని హెచ్చరించినట్టుగా సమాచారం. కూటమి పార్టీలతో టీడీపీ శ్రేణులు మరింత మెరుగైన సంబంధాలను కొనసాగించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. 2024లో పార్టీ విజయానికి కూటమి పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారని… రాబోయే రోజుల్లో అంతకుమించిన సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.