
పయనించే సూర్యుడు న్యూస్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కు నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని అలాంటి వ్యక్తికి భద్రత తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టం వల్లే ఇలా భద్రత కుదించినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మరోవైపు తనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీన్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఉన్న ‘వై’ క్యాటగిరీ భద్రతను ‘ఎక్స్’కు కుదించింది. నామమాత్రంగా ఉండే ఈ ఎక్స్ క్యాటగిరీలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఆయన వెంట ఉంటారు. కాగా ఈ సిబ్బందిని వెనుకకు రావాలని ఇంటెలిజెన్స్ విభాగంలోని ఐఎస్‌డబ్ల్యూ ద్వారా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఆర్ఎస్పీకి సెక్యూరిటీ అవసరంలేదని...ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో జూలై ఒకటి నుంచి ఐఎస్‌డబ్ల్యూ ఆఫీసులో రిపోర్టు చేయాలని డ్రైవర్‌కు మౌఖికంగా చెప్పింది. అయితే ఈ అంశంపై ఆర్ఎస్పీ స్పందించారు. తనకు భద్రత తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి, పోలీసుశాఖకు లేఖరాసినట్టు తెలుస్తోంది.తనకు ఏమైనా జరిగితే దానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరించారు. ‘రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక పరిటాల రవిని చంపినట్లే.. ఫ్యాక్షనిస్టులతో నన్ను చంపించాలని అనుకుంటున్నారు’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆందోళన వ్యక్తంచేశారు.
20 ఏండ్ల నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారే
భద్రత తొలగింపుపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన 26 ఏళ్ల సర్వీసులో దాదాపు 12 నుంచి 15 ఏళ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే పనిచేసినట్లు గుర్తు చేశారు. నక్సలైట్ల నుంచి ఫ్యాక్షనిస్టుల వరకూ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని అన్నారు. మొదటి పోస్టింగ్ బెల్లంపల్లి ఏఎస్పీగా, ఆ తర్వాత కరీంనగర్ ఎస్పీగా, వరంగల్ ఓఎస్డీగా కీలకమైన ఆపరేషన్స్ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య సమయంలో ఆయనే అక్కడ బాధ్యతల్లో ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే గత 20 ఏళ్లుగా బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుతున్నారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.