
జనం న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటేనా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయగా.. గల్ఫ్‌లో దాని సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులకు దిగింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జల సంధిలో ఓ ట్యాంకర్ నౌకపై క్షిపణి దాడి చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఐదో నిబంధన ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు కుదుర్చుకున్న ఒప్పందంపై అనిశ్చితి నెలకుంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలూ మళ్లీ కాల్పులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలోని ఒక చమురు ట్యాంకర్‌పై 'గుర్తుతెలియని క్షిపణి' దాడి చేసి దెబ్బతీసిందని బ్రిటన్ మారిటైమ్ భద్రతా సంస్థ యూకేఎమ్‌టీఓ శనివారం తెలిపింది. ‘‘ఆ నౌకలోని వంతెన దెబ్బతింది.. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం’’ అని యూకేఎమ్‌టీఓ పేర్కొంది, ఆ నౌక పనామా జెండా కలిగిన 'కికు' అనే ట్యాంకర్ అని మరో బ్రిటన్‌కు చెందిన మరో మారిటైమ్ భద్రతా సంస్థ వాన్‌గార్డ్ టెక్ వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా దాడుల అనంతరం, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ శనివారం ప్రకటించింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య ఉదయం నుంచి పెరిగిందని, దీనికి ఐఆర్జీసీ నావికాదళం అధికారమే కారణమని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విలేకరి శనివారం పేర్కొన్నారు. ‘‘శనివారం ఉదయం నుంచి, హర్మూజ్ జలసంధి గుండా ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య పెరిగింది.. ఇది ఐఆర్జీ నేవీ అధికార ఫలితమే’’ అని ఆ విలేకరి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ.. అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే వేగవంతమైన, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ‘‘పశ్చిమాసియాలోని తన ప్రాక్సీ దళాల చర్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా ఈ ఒప్పందంలోని మొదటి నిబంధనను ఉల్లంఘించింది.. హర్మూజ్ జలసంధిలో నిరంతర రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించిన వాటి ద్వారా ఐదో నిబంధనను అతిక్రమించింది.. ఈ ఒప్పందంలోని ఏ నిబంధనను ఉల్లంఘించినా ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది’’ అని రెజాయీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అటు, హార్మూజ్ జలసంధి ద్వారా మరింత ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఒమన్ సమీపంలో సముద్ర మార్గం విస్తరిస్తోందని అమెరికా నేవీ తెలిపింది. ఒమన్ తీరానికి సమీపంలోని హర్మూజ్ ద్వారా నౌకల రాకపోకలను అనుమతించడానికి ఒక మార్గం విస్తరిస్తున్నట్లు యుఎస్ నావికాదళం పర్యవేక్షిస్తున్న సముద్ర సంస్థ శనివారం తెలిపింది. జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చేసిన ప్రకటన.. జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా ఒత్తిడి చేస్తోందని ఇరాన్‌కు మరో హెచ్చరికలు పంపింది.